Pawan-Telangana: పవన్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ.. కుట్రేనా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కోనసీమ పర్యటనలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. కోనసీమ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించే క్రమంలో ఆయన చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలను పట్టుకొని తెలంగాణలోని (Telangana) కొందరు నేతలు చేస్తున్న రాద్ధాంతం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక సాధారణ పోలికను, ప్రకృతిపై ఉన్న ప్రేమను పట్టుకొని ఇంతలా విద్వేషాలు రగల్చడం వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్, అక్కడి పచ్చని ప్రకృతిని చూసి పరవశించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కోనసీమ అందాలు చూస్తే ఎవరికైనా అసూయ కలుగుతుంది. తెలంగాణ నుంచి వచ్చిన వారు ఇక్కడి పచ్చదనాన్ని చూసి, తమకు ఇలాంటి అందాలు లేవే అని బాధపడతారు. వారి దిష్టి కోనసీమకు తగులుతుందేమో” అని చమత్కరించారు. ఇది కేవలం కోనసీమ గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నమే తప్ప, తెలంగాణను కించపరచాలనే ఉద్దేశం కాదన్నది సామాన్యులకు సైతం అర్థమయ్యే విషయం.
అయితే, పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని కొందరు నేతలు అస్త్రంగా మలుచుకున్నారు. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి, ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ ప్రచారం మొదలుపెట్టారు. కోనసీమ అందంగా ఉంటే, తెలంగాణ అడవులు, జలపాతాలు అందంగా లేవా? అంటూ అనవసరమైన వివాదాన్ని తెరపైకి తెచ్చారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణ సంస్కృతిని, యాసను, అక్కడి పోరాట పటిమను గౌరవిస్తూనే ఉంటారు. ఆయన సినిమాల్లోనూ, బయట ప్రసంగాల్లోనూ తెలంగాణ పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కొంతమంది వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం గమనించిన పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. తన మాటలను వక్రీకరించవద్దని స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. తద్వారా రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వ్యక్తినని ఆయన పునరుద్ఘాటించారు. సాధారణంగా ఒక నేత వివరణ ఇచ్చిన తర్వాత వివాదం సద్దుమణుగుతుంది. కానీ, పవన్ విషయంలో మాత్రం విమర్శల దాడి ఆగడం లేదు. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.
పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ అంశాన్ని ఇంకా సాగదీయడం వెనుక స్పష్టమైన రాజకీయ కుట్ర ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రజలు సామరస్యంగా ఉంటున్నారు. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి, ‘ఆంధ్రా-తెలంగాణ’ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలున్నాయి. తద్వారా పవన్ కల్యాణ్ ను తెలంగాణ సమాజానికి దూరం చేయాలనేది కొందరి వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇతర ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, పవన్ వ్యాఖ్యలను ఒక సాధనంగా వాడుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఒక చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపించడం ద్వారా అసలు సమస్యలను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. పవన్ కల్యాణ్ కు తెలంగాణలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని పార్టీల నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం ద్వారా, భవిష్యత్తులో ఆయన ప్రభావం తెలంగాణపై పడకుండా చూడాలనే దురుద్దేశం కూడా దీని వెనుక ఉండి ఉండవచ్చు.
పవన్ కల్యాణ్ మాటల్లో దొర్లిన ఒక చిన్న పోలికను పట్టుకొని, ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి సాగుతున్న తరుణంలో, ఇలాంటి అనవసర వివాదాలు సృష్టించి చలి కాచుకోవాలనుకోవడం దురదృష్టకరం. పవన్ కల్యాణ్ వంటి నేత ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేయడం ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా నేతలు సంయమనం పాటించి, వక్రీకరణలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






