Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. అంతుచిక్కని ఓటరు నాడి!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ (Jubilee hills Byelection) ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్ (Congress) , ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS), గట్టి పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ (BJP) మధ్య ఈ పోరు హోరాహోరీగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీల భవిష్యత్తుకు కీలకంగా మారింది. ముఖ్యంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు ఇక్కడ గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది.
ప్రచార పర్వంలో అగ్ర నాయకులంతా రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలో వాతావరణం వేడెక్కింది. అయితే, వివిధ ప్రీ-పోల్ సర్వేలు, అంతర్గత అంచనాలు మిశ్రమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో ఏ పార్టీ కూడా విజయంపై ఒక నిర్దిష్ట అంచనాకు రాలేకపోతోంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైవిధ్యమైన ఓటర్ల సామాజిక-రాజకీయ అంశాల కారణంగా, ఈసారి ప్రజల నాడిని పట్టుకోవడం అన్ని పార్టీలకు కత్తిమీద సాములా మారింది.
నియోజకవర్గంలో కీలకమైన ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ వైపు స్పష్టమైన మొగ్గు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, ముస్లిం మైనారిటీల పట్ల అనుకూలత, ఎంఐఎం మద్దతు, అజారుద్దీన్ కు మంత్రి పదవి.. లాంటివి కాంగ్రెస్ విజయావకాశాలను బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా మజ్లిస్ (AIMIM) పరోక్ష మద్దతు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోవైపు ఇప్పటివరకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీహిల్స్‌ను తమకే ఓటర్లు తిరిగి పట్టం కడతారని బీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తోంది. దివంగత ఎమ్మెల్యే సతీమణిని రంగంలోకి దించడం ద్వారా సానుభూతి పవనాలను ఆశించడంతో పాటు, అర్బన్ ప్రాంతాల్లో తమకున్న సంప్రదాయ ఓటు బ్యాంకుపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అయితే, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఓట్లు గణనీయంగా పడిపోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.
బీజేపీ సైతం ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్‌లో తమ బలాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్న బీజేపీ, ప్రధానంగా నియోజకవర్గంలోని విద్యావంతులతో పాటు హిందూ అర్బన్ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ మెరుగైన ఫలితాలు సాధించడం, బీఆర్ఎస్ ఓట్లు తగ్గడం ఈసారి త్రిముఖ పోరును మరింత ఉత్కంఠభరితం చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకుని, వారి నోటికి తాళం వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే, ముస్లిం ఓటర్లతో పాటు, అధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓటర్లను, సినీ రంగ ప్రముఖులు నివసించే ప్రాంతాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోంది. హామీలు, పథకాల అమలుతో పాటు, నియోజకవర్గంపై పట్టున్న అభ్యర్థిని నిలబెట్టడంతో విజయం తమదేనని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.
మొత్తంమీద సంపన్న, మధ్యతరగతి వర్గాలతో పాటు మైనారిటీ/బడుగు బలహీన వర్గాల జనాభా సమ్మేళనంగా ఉన్న జూబ్లీహిల్స్ ఓటరు నాడిని పట్టుకోవడం మాత్రం అన్ని పార్టీలకూ పెద్ద సవాలుగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక సీటుకే పరిమితం కాకుండా, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే రాష్ట్ర రాజకీయాల దిశను నిర్దేశించనుంది.







