Phone Tapping: రంగంలోకి దిగనున్న సిబిఐ..?

తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ పరిణామాలు ఉండబోతున్నాయా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ విషయంలో బిజెపి(BJP) నేతలు కూడా బాధితులే కావడంతో ఆ పార్టీ అధిష్టానం ఈ విషయంలో కీలక అడుగులు వేసే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముందు నుంచి ఈ విషయంలో సిబిఐ(CBI) విచారణను తెలంగాణా రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ దిశగా జాతీయ నాయకత్వం కూడా అడుగులు వేస్తోంది.
జాతీయ స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ విషయంలో పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణా బిజెపి ఎంపీలు డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో బిజెపి అధిష్టానం కూడా సీరియస్ గా ఉండటంతో.. సిబిఐ విచారణ దిశగా అడుగులు వేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణకు ఒప్పించే దిశగా ఒత్తిడి చేయాలని బిజెపి భావిస్తోంది.
పార్లమెంట్ సమావేశాల ద్రుష్ట్యా రేపటి బండి సంజయ్ విచారణ వాయిదా పడింది. ఈనెల 28న హాజరవుతున్నట్లు సిట్ కు లేఖ రాసారు బండి సంజయ్. అదే రోజు సంజయ్ తోపాటు సిట్ విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర నిఘావర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలను బండి సంజయ్ సేకరించినట్టు తెలుస్తోంది. సిట్ ఎదుట ఆ ఆధారాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్జిల ఫోన్ లను కూడా ట్యాపింగ్ చేసారనే ఆరోపణలు ఉన్నాయి.
దీనితో కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. భార్యభర్తల బెడ్రూం మాటలను ట్యాప్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యంగ హక్కులకు భంగం కలిగించినట్టే అనేది నిపుణుల మాట. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటీషన్ దాఖలు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై కూడా నిఘా వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. పెద్దాయన చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ రావు అంగీకరించారు. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు కూడా చెప్పడంతో బీఆర్ఎస్(BRS) అగ్ర నాయకత్వానికి ఉచ్చు బిగుస్తోంది. ఆధారాలతో విచారణకు హాజరు కావాలని భావిస్తోన్న బండి సంజయ్ విచారణలో ఏ విషయాలు బయటపెడతారు అనేది ఆసక్తిగా మారింది.