Phone Tapping Case : మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..! బీఆర్ఎస్ నేతలకు చిక్కులేనా..!?

తెలంగాణను కుదిపేసిన అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. పలువురు విపక్ష పార్టీల నేతలు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసి సొంత ప్రయోజనాలకోసం వాడుకుందని వార్తలొచ్చాయి. దీంతో గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకుంది. దీనిపై విచారణ చేపట్టింది. దీంతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులతో పాటు బీఆర్ఎస్ ప్రముఖులు కూడా ఉన్నట్టు తేలింది.
ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా నేరం. వాస్తవానికి తీవ్రవాద కార్యకలాపాల లాంటివాటికి పాల్పడుతున్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేపడుతుంటాయి. అది కూడా అనేక అనుమతులు తీసుకున్న అనంతరమే ఇది సాధ్యమవుతుంది. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో యధేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ కు అవసరమైన సామాగ్రిని తెప్పించుకుని పలువురి నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని వార్తలొచ్చాయి. దీనిపై ఈ ఏడాది మార్చి 10న కేసు నమోదైంది. 11 నుంచి దీనిపై విచారణ మొదలైంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన పలువురు పోలీస్ ఉన్నతాధికారుల ప్రమోయం ఉన్నట్టు గుర్తించారు. అప్పటి ఓఎస్డీ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న ఈ కేసులో నేరుగా సంబంధం ఉందని గుర్తించారు. కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లందరినీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపతున్నారు. ప్రభాకర్ రావు మాత్రం తాను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్తూ కాలం గడుపుతున్నారు. తాజాగా ఆయన అమెరికా గ్రీన్ కార్డు పొందినట్లు వార్తలందుతున్నాయి. దీంతో ఆయన్ను రప్పించాలంటే ఇంటర్ పోల్ సాయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తొలిసారి ఓ పొలిటీషియన్ కు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య పోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందుకే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు పెద్దల హస్తం ఉందని.. త్వరలోనే వాళ్లు కూడా జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేతలు లీకులు ఇస్తూ వస్తున్నారు.