Green Card: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!
అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ సంతతి మహిళకు ఊహించని షాక్ తగిలింది. మూడు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న 60 ఏళ్ల బబ్లీ కౌర్ (Bubbly Kaur) గ్రీన్ కార్డ్ (Green Card) ఇంటర్వ్యూ కోసం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్‌కి వెళ్లగా.. అక్కడి అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబ్లీ కౌర్, లాంగ్ బీచ్‌లో రెస్టారెంట్ నడుపుతున్నారు. అమెరికా పౌరురాలైన ఆమె కుమార్తె ద్వారా గ్రీన్ కార్డ్ (Green Card) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ చివరి దశలో భాగంగా డిసెంబర్ 1న బయోమెట్రిక్ స్కానింగ్ కోసం వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి వ్యాన్‌లో తీసుకెళ్లారని కుమార్తె జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోయినా, ఆమెను (Bubbly Kaur) డిటెన్షన్ సెంటర్లో ఉంచడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నేత రాబర్ట్ గార్సియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షుడయ్యాక వలస విధానాలు కఠినతరం కావడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కుటుంబం న్యాయ పోరాటానికి సిద్ధమైంది.






