Rahul Gandhi: మహాత్మా గాంధీకి అవమానం.. ఉపాధి హామీని అంతం చేసే కుట్ర: రాహుల్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు, పేదల హక్కులకు జరుగుతున్న “అవమానం” అని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధాంతాలంటే తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అందుకే పేదల జీవనాధారమైన ఈ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, ఉపాధి హామీ పథకం కేవలం ఒక స్కీమ్ కాదని, అది గ్రామీణ స్వరాజ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కోట్లాది కుటుంబాలను ఆదుకున్నది ఈ పథకమేనని గుర్తుచేశారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ (VB-G RAM G) బిల్లు ద్వారా రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం పడుతుందని, నిధులు అయిపోతే పని దొరకని పరిస్థితి ఏర్పడుతుందని రాహుల్ (Rahul Gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకే మోదీ ఈ మార్పులు చేస్తున్నారని, గత పదేళ్లుగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా వ్యతిరేక బిల్లును తీవ్రంగా ప్రతిఘటిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.






