Parliament: నరేగా స్థానంలో వీబీ-జీ రామ్ జి బిల్లు.. విపక్షాల ఆగ్రహం..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొస్తున్న కొత్తచట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) … కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇది ఎంజీ నరేగా (MGNREGA) చట్టాన్ని బలహీనపర్చడమేనని దుయ్యబట్టారు.
‘‘ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కేంద్రం మారుస్తూనే ఉంది. పథకాల పేర్లను మార్చడం అంటే మోడీ (PM Modi) ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావట్లేదు. ఎంజీ నరేగా చట్టం పేద ప్రజలకు 100 రోజుల ఉపాధి హామీ కల్పిస్తోంది. ఈ కొత్త బిల్లుతో (VB G Ram G) ప్రస్తుత చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లులో ఒకటో, రెండో కొత్త విషయాలు చేర్చారు. పని దినాలను పెంచారు. అంతేగానీ.. వేతనాన్ని పెంచారా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు.
‘‘గతంలో గ్రామ పంచాయతీలు ఈ పథకం కింద పని చేయించేవి. ఇప్పుడు కొత్త బిల్లుతో పంచాయతీలకు ఆ హక్కును దూరం చేస్తున్నారు. ఇక, ఈ బిల్లుతో ఉపాధి హామీ పథకంపై కేంద్రం నియంత్రణను పెంచి, నిధులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ఇష్టానుసారంగానో బిల్లులను ఆమోదించుకుంటామంటే కుదరదు. ఈ బిల్లును తక్షణమే కేంద్రం ఉపసంహరించుకోవాలి’’ అని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ప్రియాంక మాట్లాడుతుండగా.. ట్రెజరీ బెంచ్‌లో కొందరు ‘ఫ్యామిలీ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘మహాత్మా గాంధీ మా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కానీ, మా కుటుంబసభ్యుడితో సమానం. గాంధీజీని యావత్ దేశం అలాగే భావిస్తోంది’’ అని కౌంటర్ ఇచ్చారు.
టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మాట్లాడుతూ రాముడి పేరుతో కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే, విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తిప్పికొట్టారు. మహాత్మాగాంధీ అంటే తమకు ఎంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోడీ సర్కారు ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ బిల్లుపై లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. అనంతరం గాంధీజీ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.






