Nara Lokesh: ఐటీ రాజధానిగా విశాఖ.. లోకేశ్ ట్వీట్ వెనుక హింట్ ఇన్ఫోసిస్ గురించేనా?
విశాఖ సిద్ధంగా ఉండు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా, ఐటీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ఐటీ రాజధానిగా వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం (Visakhapatnam) వైపు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచాయి. “విశాఖకు వచ్చే ప్రపంచ ఛాంపియన్ ఎవరు?” అని నెటిజన్లను ప్రశ్నించడంతో సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 18 నెలల్లో విశాఖలో ఐటీ రంగానికి సంబంధించిన కదలికలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, పెట్టుబడులకు ఇచ్చే రాయితీలు పెద్ద సంస్థలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ (Google) డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోవడం విశాఖ ఐటీ భవిష్యత్తుకు బలమైన సంకేతంగా మారింది.
అదే సమయంలో టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ (Cognizant) వంటి ఐటీ దిగ్గజాలు కూడా విశాఖలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించి, శాశ్వత భవన నిర్మాణానికి కాపులుప్పాడ (Kapuluppada) ప్రాంతంలో భూమి పూజ చేసింది. మూడేళ్లలో పూర్తి స్థాయి క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మరోవైపు టీసీఎస్ కూడా రుషికొండ ఐటీ హిల్స్ (Rushikonda IT Hills) లో టెంపరరీ క్యాంపస్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ పరిణామాల మధ్య లోకేశ్ చేసిన ట్వీట్ వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది నెటిజన్లు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)నే ఆ “ప్రపంచ ఛాంపియన్”గా భావిస్తున్నారు. ఇప్పటికే ఇన్ఫోసిస్‌కు విశాఖలో కార్యాలయం ఉండటం, దానిని మరింత విస్తరించాలన్న ఆలోచనలో సంస్థ ఉండటం ఈ అంచనాలకు బలం ఇస్తోంది.
ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం ఎండాడ (Endada) సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది. భూమి కేటాయింపు, రాయితీల అంశాలపై ప్రభుత్వం–సంస్థ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ నెలలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు చెబుతున్నారు. లోకేశ్ ఢిల్లీ (Delhi) పర్యటనలో ఈ అంశంపై స్పష్టత రావడంతోనే ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారన్న వాదన వినిపిస్తోంది.
ఇన్ఫోసిస్ విశాఖ ప్రయాణం ఇప్పటికే మొదలైంది. 2022 అక్టోబర్‌లో మధురవాడ (Madhurawada) లో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ, 2023 అక్టోబర్ 16న రుషికొండ ఐటీ హిల్స్‌లో అధికారికంగా తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయంలో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వ పాలసీ మరింత ఆకర్షణీయంగా ఉండటంతో విశాఖ క్యాంపస్‌ను పెద్ద స్థాయిలో విస్తరించాలనే ఆలోచనలో ఇన్ఫోసిస్ ఉందన్న వార్తలు విశాఖ ఐటీ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి.






