Kavitha: BJPలో విలీనానికి BRS ప్రయత్నం.. కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మీడియా చిట్‌చాట్‌లో కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో (BJP) కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని.. జైల్లో ఉన్నప్పుడే తాను ఈ ప్రతిపాదనను వ్యతిరేకించానని ఆమె అన్నారు. పరోక్షంగా ఆమె సోదరుడు కేటీఆర్ (KTR) పై విమర్శలు గుప్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు సరిగా నిర్వర్తించట్లేదనన్నారు. తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని, ఆయన నాయకత్వంలో మాత్రమే తాను పని చేస్తానని కవిత స్పష్టం చేశారు. పార్టీలో లేఖ బయటపెట్టిన లీకు వీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లాగా మాట్లాడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని తాను జైల్లో ఉన్నప్పుడే వ్యతిరేకించానని చెప్పారు. “101 శాతం బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది, నేను ఉంటే అది కుదరదు” అని ఆమె చెప్పారు. అందుకే తనను సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కవిత తన సోదరుడు కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నీతులు చెప్పడం మానండి అని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్ఎస్‌లో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులు ఇచ్చి తనను తిట్టిస్తున్నారని ఆరోపించారు. నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, ఇంకెవరి నాయకత్వంలోనూ పనిచేయను అని స్పష్టం చేశారు. పార్టీలోని లీకు వీరులు తన లేఖను బహిర్గతం చేశారని, వారిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ అయినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఊరూరా నిరసనలు చేయకుండా ట్విట్టర్‌లో సందేశాలకే పరిమితమయ్యారని విమర్శించారు.
కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం తాజా వ్యాఖ్యలతో మరింత ఊపందుకుంది. అయితే.. “కొత్త పార్టీ ఎందుకు? ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుంది,” అని కవిత అన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తి, బీజేపీతో విలీనం ఆరోపణలు కొత్త పార్టీ అనుమానాలను రేకిత్తిస్తున్నాయి. అయితే పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరడంతో ఇక కవిత అక్కడ మనుగడ సాగించడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కవితపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఇక వెనుకాడకపోవచ్చని కూడా చెప్తున్నారు.