ఆఫీస్ స్పేస్‌లకు పెరిగిన డిమాండ్

దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆఫీస్ స్పేస్‌లకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. మరోవైపు ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. కరోనా తగ్గిపోవడంతో మళ్ళీ రియల్ రంగానికి పూర్వదశ వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరిగిపోతున్నది. గత సంవత్సరంలోనే దూకుడు మీదున్న రియల్ మార్కెట్ ఈ ఏడాది మరింత ఊపందుకోనున్నది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌కు స్వస్తి చెప్పడంతో ఉద్యోగులంతా ఆఫీస్ బాట పడుతున్నారు. దీనికి తోడు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో ఫిదా అవుతున్న అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరానికి క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే బిల్డర్లు 80 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్‌లు ఏర్పాటు చేస్తుండగా.. భవిష్యత్తులో కోటి పైచిలుకు చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్‌ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా.. అంతర్జాతీయ కంపెనీలకు అడ్డాగా మారిన హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. 2022లో 80 లక్షల చదరపు అడుగుల (8 మిలియన్లు) విస్తీర్ణంతో కూడిన ఆఫీస్‌కు నగరంలో డిమాండ్ ఉంటుందని రియల్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరిగినట్లుగానే 2022లో సైతం ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం దేశంలోనే ఆఫీస్ స్పేస్ విషయంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దేశంలోని ఇతర నగరాల్లోని ప్రీమియం ఆఫీస్ స్పేస్ భవనాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఎక్కువగా డిమాండ్ ఉందన్నారు. అంతర్జాతీయ కంపెనీలు మధ్యవర్తుల ద్వారా స్థలాలను లీజుకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.