హైదరాబాద్‌లో పెరిగిన ఆఫీస్ స్పేస్ డిమాండ్

హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడిరచింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది. ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజు నమోదైంది. కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది.
గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్‌ఎఫ్‌టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ తన అంచనాలు వెల్లడిరచింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2022లో 72 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది.
టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. దేశవ్యాప్తంగా టాప్%-%8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్‌అండ్‌ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50%-%53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని అధిగమించినట్టు తెలిపింది. ‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్‌లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ%-%కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడిరచింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్‌కు కలిసొస్తున్నట్టు వివరించింది.
ఇళ్ళ నిర్మాణాల జోరు
హైదరాబాద్‌లో ఇళ్ళ నిర్మాణాలు బాగా జోరుగా సాగుతోంది. దానికితోడు రేట్లు బాగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు తగ్గిపోయారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్‌లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.