పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒడిశా : నవీన్ పట్నాయక్
ఒడిశాలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. హైదరాబాదులో ఒడిశా ప్రభుత్వం, ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో నవీన్ పాల్గొని ప్రసంగించారు. ఒడిశాలో కొనసాగుతున్న సుస్థిర ప్రభుత్వం పారిశ్రామీకరణకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్లో అతి వేగంగా స్థిరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఒడిశా. దేశంలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. సరళతర వ్యాపార నిర్వహణ, పెట్టుబుడుల సమీకరణలో పురోగమిస్తున్నాం అని తెలిపారు.
అంతకుముందు నవీన్ పట్నాయక్ తెలంగాణలోని పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఒరాకిల్ సంస్థ ఎండీ శైలేంద్ర కుమార్, మైక్రోసాఫ్ట్, అధినేత రాజీవ్ కుమార్, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్ల, దివ్యశక్తి గ్రూపు అధినేత రవీంద్ర అగర్వాల్ తదితర ప్రముఖులతో మాట్లాడారు. వచ్చే నెల 30 నుంచి డిసెంబరు 4 వరకు భువనేశ్వర్లో నిర్వహించే ఒడిశాలో తయారీ (మేకిన్ ఒడిశా కాంక్లేవ్-22) సదస్సులో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.






