DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) పదవిని చేపట్టాలని కోరుకుంటున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ (DK Aruna) తన మనసులోని మాటను చెప్పారు. అమె మీడియాతో మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి ఒక లక్ష్యం ఉండాలని, సీఎం పదవే లక్ష్యంగా తాను మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోవడంలో తప్పు లేదని, నిర్ణయం తన చేతుల్లో లేకపోయినా, తొలి మహిళా సీఎంగా కావడానికి కృషి చేస్తూనే ఉంటానని వెల్లడిరచారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నా గెలిచిన వాళ్లు కూడా ఇంకా ముందుకు వెళ్లటం లేదని, అక్కడే ఆగిపోతున్నారన్నారు. తాను మొదటిసారి పార్లమెంట్ (Parliament)కు పోటీ చేసి ఓడిపోయాయని, ఆ తర్వాత అసెంబ్లీ(Assembly) కి పోటీ చేసి ఓడిపోయానని, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచానన్నారు. ఎమ్మెల్యే పదవిని చేపట్టడంతో పాటు మంత్రిని కూడా అయ్యానన్నారు. ప్రస్తుతం ఎంపీని కూడా అయ్యానని గుర్తు చేశారు. పట్టుదలతోనే ఏదైనా సాధించాలనే తపన మహిళలకు ఉంటుందని అయితే వాళ్లు వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.