Etala Rajender : రాష్ట్ర మంత్రులు బాధ్యతగా ఉండాలి .. అనవసరంగా కేంద్రంపై

తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తాము కూడా కోరుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సచివాలయంలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy ) ని కలిసిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. బీజేపీ (BJP ) ఎంపీలమైనప్పటికీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు , నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. యూరియా సమస్య కూడా పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులుగా బాధ్యతగా ఉండాలి, అవసరంగా కేంద్రంపై విమర్శలు చేయొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన కొందరు పేదల జాబితాను మంత్రి పొంగులేటికి ఇచ్చినట్టు తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం రూ.5 లక్షలతో పూర్తయ్యే పరిస్థితి లేదని, కనీసం రూ.12 లక్షలు ఇవ్వాలని కోరారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించక పోవడంతో వాటిలో దొంగలు పడుతున్నారన్నారు. జవహర్‌నగర్ (Jawaharnagar) లో మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూముల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చడం సరికాదన్నారు.