ఒక్కరోజులోనే తెలంగాణలో … రూ.37,870 కోట్ల పెట్టుబడులు

తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒక్కరోజే ర్షాఱ్టంలో రూ.37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రెజ్, జేఎస్‌డబ్ల్యూ, గోడి, వెబ్ వెర్క్స్, ఆరా జెన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదానీ సంస్థ చొరవ చూపించింది. పలు విద్యుదుత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య ఔషధ సంస్థలు, డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో జరిపిన చర్చల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.