MLC Kavitha: మోదీ బీసీ అయితే ఏంటి? ఓసీ అయితే ఏంటి?: కవిత

తెలంగాణలో బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) విమర్శించారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల జనాభా తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కన పెట్టి, ప్రధాని మోదీ బీసీనా కాదా అనే అనవసర చర్చను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని ఆమె ఆరోపించారు. అలాగే, రాహుల్ గాంధీ ఏ మతానికి చెందినవారు అనే ప్రశ్నను కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ మళ్లీ లేవనెత్తడం ద్వారా ఈ అనవసర చర్చను కొనసాగిస్తున్నారని ఆమె (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి బదులు ఇలా అనవసరమైన చర్చలతో సమయం వృథా చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
“మోదీ బీసీ అయితే మాకేం? ఓసీ అయితే మాకేం?” అని కవిత ప్రశ్నించారు. బీసీల జనాభాను సరిగ్గా లెక్కించాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేసిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులేని లెక్కలతో అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టాలని, దాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఆమోదించాలని ఆమె (MLC Kavitha) డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా.. మోదీ కులం, రాహుల్ మతం గురించి మాట్లాడుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీపై ఆమె మండిపడ్డారు. బీసీ సముదాయాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని, వంకర టింకర మాటలతో ప్రజలను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారని ఆమె (MLC Kavitha) ఆరోపించారు.