Danam :కాంగ్రెస్ పార్టీలో వారికే పదవులు : ఎమ్మెల్యే దానం

కాంగ్రెస్ పార్టీలో హామీలు ఉండవని, పనిచేసే వారికే పదవులు దక్కుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) అన్నారు. హిమాయత్‌నగర్ (Himayatnagar)లో రూ.60 లక్షలతో రోడ్డు పనులను దానం ప్రారంభించారు. అనంతరం ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 150 మందికి కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం కల్పించారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi ) ఆశయాలను రేవంత్ ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పారు. జీహెచ్‌ఎంసీ నుంచి మంత్రి పదవి వస్తుందా అన్న ప్రశ్నకు ఇంకా సమయం ఉందని, వేచి ఉండాలని సూచించారు. నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారికి దానం అభినందనలు తెలిపారు.