కేసీఆర్‌పై ప్రతీకారం..! అరికెపూడి గాంధీకి పీఏసీ పీఠం..!?

పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టింది. ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. 2014లో, 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. రెండోసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతీకారం కోసం వేచి చూసింది. ఇప్పుడు అధికారం దక్కడంతో బీఆర్ఎస్ ను కూడా అలాగే టార్గెట్ చేస్తోంది. నాడు బీఆర్ఎస్ చేసిన పనులనే చేస్తూ ఆ పార్టీకి చుక్కలు చూపెడుతోంది.
బీఆర్ఎస్ కు చెందిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంతమందిని కూడా లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ. వాస్తవానికి ఆ పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కాలి. కానీ స్పీకర్ మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి కట్టబెట్టారు. ఇది సంచలనం కలిగించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఆ పదవి ఎలా కట్టబెడతారని బీఆర్ఎస్ మండిపడుతోంది. అయితే అరికెపూడి గాంధీ మాత్రం తాను కాంగ్రెస్ లో చేరలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి ఇప్పుడు పీఏసీ పదవికి హరీశ్ రావును సిఫారసు చేశారు కేసీఆర్. అయితే ఆయన్ను కాదని అరికెపూడి గాంధీని ఎంపిక చేశారు స్పీకర్. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పీఏసీ పదవి ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న బీఆర్ఎస్.. ఆ పదవిని బీఆర్ఎస్ కు కాకుండా ఎంఐఎంకు కట్టబెట్టింది. దీన్ని మనసులో పెట్టుకున్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా బీఆర్ఎస్ కు ఆయన గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. నాడు తనకు పదవి దక్కకుండా చేసినందుకు ఆయన ప్రతీకారం తీర్చుకున్నారని భావిస్తున్నారు.
గతంలో కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా ఏనాడూ వ్యవహరించలేదని.. ఇప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తనకు పీఏసీలో స్థానం కల్పించాలంటూ అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ తరపున అప్లై చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. ఆయనకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. పీఏసీ ఎంపిక పూర్తిగా స్పీకర్ నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని కాదనేదానికి లేదు. అరికెపూడి గాంధీ కూడా తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తుండడంతో లాజికల్ గా ఆ పదవి బీఆర్ఎస్ కే దక్కినట్లు భావించాలి. ఇలా కేసీఆర్ కు తన కంటిని తానే పొడిపించుకునేలా కాంగ్రెస్ సర్కార్ చేసిందని పలువురు అభిప్రాయపడ్తున్నారు.