Bangladesh: ఉగ్రవాద ముఠాలకు అడ్డాగా బంగ్లాదేశ్…? త్రైపాక్షిక కూటమితో భారత్ కు తలనొప్పులు ..?
భారత్ కు వ్యతిరేకంగా చైనా ఏర్పాటు చేస్తున్న త్రైపాక్షిక కూటమి.. ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఓ వైపు పాకిస్తాన్ తో సీమాంతర ఉగ్రవాదం .. దశాబ్దాలుగా ఇబ్బంది పెడుతోంది. ఒక్క పాకిస్తాన్ తో మనం యుద్ధ క్షేత్రంలోనూ అంతర్జాతీయ వేదికలపైనా పోరాటం చేస్తున్నాం. మరి అలాంటిది.. పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కూడా.. అదే బాటలో నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఏకకాలంలో రెండు దేశాల నుంచి వచ్చే ఉగ్రముప్పుతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వీరికి అండగా.. బ్యాక్ గ్రౌండ్ గా చైనా అండ ఉండనే ఉంది. మరి ఈ త్రైపాక్షిక కూటమిని ఎలా ఎదుర్కోవాలి.?
ఆపరేషన్ సిందూర్ తో పాక్ కొమ్ములు విరిచామని మనం అనుకుంటున్నాం. కానీ.. సిందూర్ తర్వాత పాక్ సైతం గేమ్ మార్చేసింది. పాక్ అనడం కన్నా.. వెనక ఉండి ఆడిస్తున్న చైనా.. ఇప్పుడు గేమ్ ప్లాన్ చేంజ్ చేసింది. ఒక్క పాక్ తో ఏమీ కాదని గ్రహించిన చైనా.. ఇప్పుడు పాక్ కు తోడు బంగ్లాదేశ్ ను బరిలోకి దించింది. దీంతో ఓవైపు పాకిస్తాన్ నుంచి, మరోవైపు బంగ్లా దేశ్ నుంచి ఉగ్రమూకలు .. దేశంలోకి చొరబడి భీభత్సం సృష్టించే ప్రమాదం కనిపిస్తోంది.
దీనికి అదనంగా అన్నట్లుగా శ్రీలంకతో కలిపి జాయింట్ ఆపరేషన్ తో తుడిచి పెట్టిన ఎల్టీటీఈ ఉగ్ర అవశేషాలు.. సైతం వీరితో కలిసి పనిచేేసే అవకాశాలున్నట్లు సమాచారం. అప్పుడు పరిస్థితి ఎంతవరకూ వెళ్తుంది. వీరిని కట్టడి చేసేదెలా..? ముఖ్యంగా వీరి నుంచి దేశాన్ని కాపాడుకోవడమెలాగన్నది మన రక్షణ రంగ నిపుణులను ఆలోచింప జేస్తున్న ప్రశ్న.
ఈ త్రైపాక్షిక కూటమిని కట్టిపడేయాలంటే లోతైన వ్యూహరచన అవసరం. దౌత్యంతో పాటు రక్షణ పరంగా అభేద్యంగా మారాల్సిన తరుణం ఆసన్నమైందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు . ఓవిధంగా చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలు మనకు సరిపోతాయంటున్నారు. అన్నివైపుల నుంచి కమ్ముకొస్తున్న ముస్లిం దేశాలను.. ఇజ్రాయెల్ తన అబేధ్యమైన సాంకేతిక నైపుణ్యం, రక్షణ వ్యవస్థతో ఎదుర్కొని మనుగడ సాధిస్తోంది. ఆప్రాంతంపై ఆధిపత్యం కూడా సాధించింది. ఇదే తరహా రణనీతిని ఇండియా సైతం వాడాల్సి ఉందన్నది నిపుణుల మాట.
కానీ.. రక్షణపరంగా మనకన్నా ముందంజలో ఉంది డ్రాగన్. ఆ దేశం నుంచి వస్తున్న ఆయుధాలు, ఇతర పరికరాలతో పాక్.. మనపై ఉగ్రదాడులకు ప్రయత్నిస్తోంది. వీటిని అరికట్టాలంటే ఎలాంటి సంస్కరణలు అవసరమన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుంది మరి.






