Ponguleti: ప్రజాసమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్ రద్దు : మంత్రి పొంగులేటి

బేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదని, ప్రజాసమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్‌ను రద్దు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. శాసనసభలో భూభారతి (Bhubharati) బిల్లును పొంగులేటి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ వల్ల 4 నెలలు రిజిస్ట్రేషన్లు జరగలేదన్నారు. ధరణితో అనేక మంది ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఆ పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు వేస్తున్నాం.
ధరణి (Dharani) స్థానంలో భూభారతి ని తీసుకొస్తున్నాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లిఖితపూర్వకంగా సూచించిన అంశాలను పొందుపరిచాం. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్‌సైట్‌లో ఉంచాం. ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్‌లో పెట్టాం. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో ఒకరోజు చర్చ కూడా నిర్వహించాం. 18 రాష్ట్రాల్లో ఆర్‌ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభారతి తీసుకొచ్చాం. ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారిని నియమిస్తాం. భూ వివాదాలపై అప్పీలుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం. అనుభవదారుల కాలాన్ని కూడా ఈ కొత్త బిల్లులో పొందుపరిచాం. 33 మాడ్యుల్స్‌తో ఉన్న దాన్ని 6 మాడ్యుల్స్‌తో పున ప్రకాళన చేస్తున్నాం అని తెలిపారు.