కేటీఆర్ చేతుల మీదుగా ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమ ప్రారంభం
తెలంగాణలోని కొత్తూరులో 200 రూపాయల కోట్లతో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ నిర్మించిన లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారా ప్రారంభించారు. దేశంలో ఇది మొట్ట మొదటి లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమ. దీని ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ తెలంగాణను కేంద్ర స్థానంగా చేసుకొని రూ.1700 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించి, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనలో భాగస్వామిగా ఉంది. కొత్తూరులోని 170 ఎకరాల స్థలంలో ఏరియల్, టైడ్, బీబీకేర్, విష్పర్, ఓలే, జిలెట్ వంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ ద్వారా 10 వేల మంది స్థానికులకు ఉపాధి లభిస్తోంది. దేశంలోని మొట్టమొదటి లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కావడం రాష్ట్రానికి గర్వకారణం. 2014లో సీఎం కేసీఆర్ సంస్థకు శంకుస్థాపన చేయగా ఎనిమిదేళ్ల అది పెద్దఎత్తున అభివృద్ధి సాధించింది. తెలంగాణలో కరోనా సమయంలో సంస్థ గణనీయమైన సేవలందించింది అని తెలిపారు.
పీఆండ్‌జీ భారత విభాగపు సీఈవో మధుసూదన్ గోపాలన్ మాట్లాడుతూ తెలంగాణ మా రెండో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, సత్వర అనుమతులు, ఇతరత్రా అన్ని రకాల అనుకూలతల వల్ల నిర్ణీత సమయానికి మా లక్ష్యాలు పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌లో మా అత్యాధునిక ప్లానింగ్ సర్వీస్ సెంటర్, ప్రత్యేక సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులకు సేవలందిస్తున్నాం. తెలంగాణలో మున్ముందు మరిన్ని భారీ పరిశ్రమలను స్థాపిస్తాం. సేవాకార్యక్రమాలను విస్తరిస్తాం అని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సంచాలకుడు కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.






