గచ్చిబౌలిలో రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్ కు శంకుస్థాపన
టెక్ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ నగరం మంచి వేదికగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సువిశాలమైన సొంత క్యాంపస్‌లు నిర్మించుకుంటున్న జాబితాలో ప్రపంచ టాప్ టెన్ టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్ కూడా చేరింది. అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలిలోని నానక్‌రాంగూడలో అంకురార్పణ జరిగింది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌కు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఇటీవల శంకుస్థాపన చేశారు. 7.3 ఎకరాల్లో 30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే సువిశాల భవన నమూనాను ఆవిష్కరించారు. అమెరికాలోని మౌంటెన్‌వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్ క్యాంపసే అతి పెద్దది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో 7.3 ఎకరాల్లో పర్యావరణ హితంగా ఈ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ భవనంలో సుస్థిరత్వం, ఇంధన సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నైపుణ్యంగల టెక్ వర్క్‌ఫోర్స్‌కు అరోగ్యకర, సహకార వర్క్‌ప్లేస్‌ను ఈ క్యాంపస్ అందించనున్నది. ఈ సందర్భంగా గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. దీంతో డిజిటల్ తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం తరపున మరో ముందడుగు పడిరదని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌లో గూగుల్ శాశ్వత క్యాంపస్ నిర్మాణంతో ‘డిజిటల్ తెలంగాణ’లక్ష్యానికి మరింత బలం చేకూరనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు ఉన్న ఉజ్వల భవిష్యత్తు, ఇక్కడి నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని గూగుల్ ఇక్కడ తన మూలాలను మరింత పదిలం చేసుకొంటున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నదని చెప్పారు. డిజిటల్ తెలంగాణ ఆలోచనకు మద్దతు ఇవ్వడంతోపాటు డిజిటల్ రంగంలో పౌరులు సాధికారత సాధించాలనే పరస్పర లక్ష్యాన్ని సాధించడానికి గూగుల్ తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. గూగుల్‌తో జరిగిన మునపటి ఒప్పందాలు అన్ని వర్గాల్లో సానుకూల మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాలకు దోహదపడ్డాయని చెప్పారు. తాజా ఒప్పందం యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
భారత్‌లో గూగుల్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి హైదరాబాద్ నగరం తమ అతిపెద్ద ఉద్యోగ స్థావరాల్లో ఒకటిగా ఉన్నదని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, ఉపాధ్యక్షుడు సంజయ్ గుప్తా తెలిపారు. తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. తాజా ఒప్పందం ద్వారా యువత ఉపాధికి సరైన నైపుణ్య శిక్షణ, డిజిటల్ నైపుణ్యాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సహకారం, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి గూగుల్ మద్దతు ఇస్తుందని వివరించారు. ఈ కొత్త ఒప్పందం ద్వారా యువత, మహిళలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లభించనుందన్నారు. పౌరసేవల్లో మార్పులు రానున్నాయని చెప్పారు. గూగుల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యనందిస్తున్నట్లు తెలిపారు. టాస్క్ ద్వారా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో గూగుల్‌తో కలిసి సర్టిఫికెట్ కోర్సులు అందించి స్కాలర్షిప్పులు కూడా ఇవ్వనున్నామన్నారు. అగ్రిటెక్‌లో గూగుల్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందన్నారు. ప్రజారవాణా మరింత మెరుగయ్యేందుకుగాను గూగుల్ మ్యాప్ సేవలను కంపెనీ మరింత విస్తరించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఒప్పందంలో భాగంగా వీ హబ్‌తో కలిసి వుమెన్ పేరుతో మహిళలను నానో, మైక్రో వ్యాపార రంగాల్లో రాణించేందుకు కావాల్సిన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ ఎంవోయూలో భాగంగా గూగుల సంస్థ కొలాబరేటివ్ టూల్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థలకు డిజిటల్ విద్యనందించనుందన్నారు. గూగుల్ కెరీర్ ద్వారా అర్హులైన యువతకు ఐటీ సపోర్ట్, ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాటిలో సర్టిఫిక్ కోర్సులతో పాటు స్కాలర్షిప్లు అందించనున్నామన్నారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.






