పర్యాటక రంగ అభివృద్ధికి రూ.3,500 కోట్లతో ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్రంలో ఆకర్షణీయమైన పర్యాటక విధానాన్ని రూపొందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్‌లో పర్యాటక అభివృద్ధికి తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. తెలంగాణ పర్యాటకలో రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.3,500 కోట్లతో ప్రణాళికలు చేపట్టాం. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన రూ.300 కోట్ల నిధులతో వివిధ ప్రాజెక్టుల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. తెలంగాణలో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, బుద్దవనం వంటి ప్రాజెక్టులు సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు తార్కాణంగా నిలుస్తున్నాయి. నేటితరం పర్యాటకులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది అని మంత్రి వివరించారు.