హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్
తెలంగాణలో ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. శంషాబాద్ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ద్వారా తొలి విడతలో సుమారు 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం. అయితే డేటా సెంటర్ సామర్ధ్యం, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలను వచ్చేనెలలోనే మైక్రోసాఫ్ట్ ప్రకటిస్తుంది. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న హైదరాబాద్ క్రమంగా ఆధునిక సాంకేతిక పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక ఐటీ సాంకేతికతలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే.






