తెలంగాణలో ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు

రక్షణ దళాలకు అధునాతన పరికరాలను (గింబాల్స్) అందించే ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడానికి ఫ్రాన్స్ సంస్థ మెరియో ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌సీ రోబోటిక్స్ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో మెరియో సీఈవో రెమి ప్లెనిట్, హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ రాధాకిషోర్ తదితరులతో కూడిన బృందం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధుల బృందం దేశ రక్షణ శాఖ లోని పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆ వివరాలను మంత్రితో చర్చించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనున్న ఉత్పత్తి కేంద్రంపై తమ ప్రణాళికలను మంత్రికి వివరించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాలను అందిస్తామని శ్రీధర్‌బాబు ఈ సందర్బంగా తెలిపారు.