Mega Engineering : తెలంగాణలో మేఘా భారీ పెట్టుబడి… రూ.15 వేల కోట్లతో

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రూ.15 వేల కోట్లతో ఆధునిక పంఫ్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ, అనంతగిరి కొండల్లో ప్రపంచస్థాయి వెల్‌నెస్ రిసార్ట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో మేఘా (Mega) ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ( ఎంఈఐఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.500 కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ ముందుకొచ్చింది.
తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యునిలీవర్ కంపెనీ(Unilever Company) సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్(Davos)లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రెండోరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు, మేఘా, యునిలీవర్, స్కైరూట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.