Maheshwar Reddy: ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? : మహేశ్వర్‌రెడ్డి

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హమీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తయిందని, హామీలు నెరవేర్చకుండా ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి (Maheshwar Reddy) ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు.
ఆరు గ్యారంటీలు నెరవేర్చేందుకు తగినంత బడ్జెట్ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చెబుతున్నారు. అన్ని వాస్తవాలు తెలిసినా అధికారం కోసం తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ హామీలపై వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ తిరస్కరించారు. అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అధికార పక్షం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నిస్తున్నాం అని అన్నారు.