Pink Book: లోకేష్ రెడ్ బుక్ ఆదర్శంగా తెలంగాణ పింక్ బుక్..

తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2019 వరకు రాజకీయాలు ఒకరకంగా ఉండేవి. కానీ ఆ తర్వాత నుంచి కక్ష సాధింపు రాజకీయాలు.. ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.గతంలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసేవి. అయితే, ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష నాయకులకు తీవ్ర ఒత్తిడి తేవడంలో పాలుపంచుకుంటున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నాయకులపై వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఎన్నో విమర్శలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన తన యువగళం (Yuvagalam) సభల్లో “రెడ్ బుక్”(Red Book) అనే విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ (YCP) ప్రభుత్వం పాలనలో జరిగిన అక్రమాలను, క్యాడర్‌కి జరిగిన అన్యాయాలను అందులో లిఖించామని తెలిపారు. ఇది జనంలో మంచి స్పందన అందుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, విపక్ష వైసీపీ “రెడ్ బుక్” రాజ్యాంగంలా మారిందని విమర్శలు చేస్తోంది. అయితే, నారా లోకేష్ తీసుకువచ్చిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు తెలంగాణ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ (BRS) నాయకులను లక్ష్యంగా చేసిందని, అనేక ఒత్తిడులు తెస్తోందని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా పార్టీ క్యాడర్‌కి ఇబ్బందులు కలుగుతున్నాయని, తమ నాయకులపై అక్రమ కేసులు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అందుకే తాము కూడా ఒక “పింక్ బుక్” (Pink Book) తయారు చేయనున్నామని, అందులో తమకు అన్యాయం చేసిన వారందరి లెక్కలు తేలుస్తామని ప్రకటించారు.
ఈ ప్రకటనను విన్న అనేక మంది రాజకీయ విశ్లేషకులు నారా లోకేష్ “రెడ్ బుక్” స్పూర్తితోనే బీఆర్ఎస్ “పింక్ బుక్” తెస్తోందా అని చర్చిస్తున్నారు. గతంలో టీడీపీకి విజయాన్ని తెచ్చిన ఈ వ్యూహం తెలంగాణలోనూ పనిచేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని, ప్రతి పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి లేదా తిరిగి గెలిచేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ “బుక్ పాలిటిక్స్” భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో చూడాల్సిందే. ప్రజలకు చేయాల్సిన మంచి గురించి కంటే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలకే రాజకీయ పార్టీలు పెద్దపీట వేయడం కరెక్ట్ కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.