Revanth Reddy: లోకల్ పోరుకు రెడీ అంటున్న రేవంత్

తెలంగాణ(Telangana)లో పంచాయతీ ఎన్నికల సందడి దాదాపుగా మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. పంచాయతీరాజ్ సమీక్ష నిర్వహించి ఎన్నికలపై ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నారు. సర్పంచ్, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు.
ఇటీవల కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా రైతు భరోసా వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గెలవాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం కార్యచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళేందుకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని… ఇప్పటికే సంకేతాలు వెళ్లినట్లుగా సమాచారం. ఇక మంత్రులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్లు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడే ప్రయత్నం చేయడం, గులాబీ పార్టీ తన సత్తా చాటేందుకు ఎదురు చూడటంతో ఎలాగైనా సరే పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపించాలని, ఆ రెండు పార్టీలకు చుక్కలు చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. దీనితో మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికల తంతును పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ప్రజల్లో ఉన్న సమయంలోనే ఎన్నికలను పూర్తిచేస్తే కలిసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అటు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇదే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచారం పంపినట్లు తెలుస్తోంది.