Brand Ambassador: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మెస్సీ?
తెలంగాణకు (Telangana) ప్రపంచ గుర్తింపు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద స్కెచ్చే వేస్తున్నారు. ఇందులో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని (Lionel Messi) తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా (Brand Ambassador) నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ లో ఈ ప్రతిపాదనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో జరగనున్న ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి లియోనెల్ మెస్సీ డిసెంబర్ 17న హాజరు కానున్నారు. ఈ పర్యటనను ఒక సువర్ణావకాశంగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆ సందర్భంగా మెస్సీతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ మెస్సీ ముందు తన అధికారిక ప్రతిపాదనను ఉంచనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను కలిగి ఉన్న మెస్సీ, ఇప్పటికే అనేక గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనకు ఆయన అంగీకారం తెలిపితే, రాష్ట్ర ఖ్యాతి, గుర్తింపు ఊహించని విధంగా పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. అప్పటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలపాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విజన్ నెరవేరాలంటే, స్టేట్ బ్రాండింగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందులో భాగంగానే మెస్సీ లాంటి ఇంటర్నేషనల్ పర్సనాలిటీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే బాగుంటుందని రేవంత్ ఆలోచిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఆకాంక్షలను కలిగించడం సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి బలంగా నమ్ముతున్నారు.
ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న వ్యక్తి లియోనెల్ మెస్సీ. ఆయన బ్రాండ్ విలువ కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాదు. సాంస్కృతిక, ఆర్థిక పరమైన కోణాల్లో ఆయనకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. మెస్సీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే, రాష్ట్రం వైపు ప్రపంచ దృష్టిని మళ్లించడంలో అది ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. సాధారణంగా రాష్ట్రాలకు లేదా దేశాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ ప్రముఖులు లేదా స్థానిక క్రీడాకారులు ఉండటం పరిపాటి. కానీ, ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ స్టార్‌ను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సాహసం అనే చెప్పాలి.
ఒకవేళ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే. తెలంగాణ దేశంలోనే కాక ప్రపంచంలో ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారాలని కోరుకుంటుందనే సంకేతాన్ని పంపుతుంది. మెస్సీ లాంటి అంతర్జాతీయ క్రీడా దిగ్గజం తమ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే, రాష్ట్రంలోని యువతకు ఉన్నత లక్ష్యాలను సాధించాలనే స్ఫూర్తి కలుగుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్ మ్యాప్‌లో లేని ఒక ప్రాంతానికి మెస్సీ అనుబంధం ఏర్పడితే, ఆయా దేశాల పర్యాటకులు తెలంగాణ గురించి తెలుసుకునే అవకాశం పెరుగుతుంది. డిసెంబర్లో మెస్సీతో జరగబోయే సమావేశం, ఆయన రియాక్షన్ పై ఈ భారీ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర బ్రాండింగ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.







