Kadiyam Srihari: కేసీఆర్ లేకుంటే కేటీఆర్ అడ్రస్ ఎక్కడ?: కడియం శ్రీహరి
కేసీఆర్ (KCR) లేని రోజున బీఆర్ఎస్ ముక్కలు, చెక్కలు కావడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లెలు కవితకు సమాధానం చెప్పలేని దద్దమ్మ కేటీఆర్ (KTR) అని విమర్శించారు. కేటీఆర్ మాదిరిగా తండ్రి అండ చూసుకొని, తండ్రి పేరు చెప్పుకొని తాను రాజయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ అడ్రస్ ఎక్కడ? అసలు ఆయనకు గుర్తింపు ఏంటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 36మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని ఇద్దరిని మంత్రులు (Ministers) చేసినప్పుడు గుర్తు రాని నీతి, నిజాయతీ, తన విషయంలో గుర్తొచ్చిందా? అని నిలదీశారు. అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకుడిని అవుతానని కేటీఆర్ అనుకోవడం అవివేకమని అన్నారు. కేటీఆర్‌ది ఐరన్‌లెగ్ అని, ఆయన నాయకత్వంలో పని చేయలేకనే కవిత దూరమైందని, హరీశ్‌రావు సైతం సమయం కోసం చూస్తున్నారని తెలిపారు.






