KTR: ఆ భూముల విషయంలో సీఎం రమేష్‌తో రేవంత్ రెడ్డి 1600 కోట్ల డీల్: కేటీఆర్

హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల తనఖా వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ తతంగం వెనుక బీజేపీ (BJP) ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ (Congress) మధ్య కుదిరిన “లోపాయికారి ఒప్పందం”గా అభివర్ణించారు. భూములు తనఖా పెట్టేందుకు సీఎం రమేష్ సహాయం చేశారని, ఇలా చేసినందుకు ఆయనకు ఫ్యూచర్ సిటీలో రూ.1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కట్టబెట్టారని కేటీఆర్ (KTR)ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర సాధికారత కమిటీ (CEC) నివేదిక ఉన్నా కూడా బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని, రాహుల్ గాంధీ ఎందుకు కళ్లు మూసుకున్నారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే జాలిగా ఉందని, సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖలో ఏముందో కూడా తెలియకుండానే ఆస్కార్ అవార్డు అంటూ మురిసిపోతున్నారని కేటీఆర్ (KTR) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ లేఖలో కేవలం సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని మాత్రమే ఉందని, ఒక్క ప్రశంస కూడా లేదని ఎద్దేవా చేశారు.