KTR: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌దే: కేటీఆర్

తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కిండ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కూలిపోయిన విషయం మర్చిపోయేలోపే రాష్ట్రంలో ఇలా మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు (Congress Government) వైఫల్యానికి అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు. గుత్తేదార్లతో కుమ్మక్కై, కమీషన్ల వేటలో ఉన్న ప్రభుత్వం.. పర్యవేక్షణను గాలికి వదిలేసిందని, దీంతో నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. ఇలా ప్రభుత్వం రాజీపడటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ (KTR) ఆరోపించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన (KTR) డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని, నిబంధనల ప్రకారమే పనులు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ (KTR) సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో బ్యారేజీలో కేవలం ఒక పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు జరుగుతున్న వరుస వైఫల్యాలపై ఏమీ మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. సుంకిశాల ప్రమాదంలో గుత్తేదారును కాపాడేందుకు వాస్తవాలు దాచి పెట్టిన ప్రభుత్వం.. కనీసం ఎస్ఎల్‌బీసీ ఘటనలో అయినా పారదర్శకంగా దర్యాప్తు జరిపాలని కోరిన ఆయన (KTR).. ప్రమాదం ఎందుకు జరిగిందో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.