ఉప్పల్ లో రామ్‌కి జెన్‌ఫ్యాక్ట్ స్క్వేర్ ప్రాజెక్టు కు మంత్రి కేటీఆర్ భూమి పూజ..
హైదరాబాద్ నలుదిశలా ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామరావు అన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం చేయకుండా నగరం నలువైపులా అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న, మధ్యతరగతి ఐటీ కంపెనీలను ప్రోత్సహించి, ఐటీని నగరమంతా విస్తరించేందు అభివృద్ధి విస్తరణ (గ్రిడ్) పాలసీని తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఐటీలో హైదరాబాద్ వెస్ట్‌కు దీటుగా హైదరాబాద్ ఈస్ట్‌ను ఉప్పల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. జెన్‌ఫ్యాక్ట్, రామ్‌కి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉప్పల్ 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న జెనెక్ట్స్ స్క్వెయిర్ టవర్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాచకొండ సీపీ మహేభ్ భగవత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌కు పశ్చిమా ఉన్న హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఉప్పల్‌లో ఆ టవర్ల నిర్మాణం పూర్తయితే 20 లోల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని, దీంతో ఐటీ మరింత విస్తరిస్తుందని తెలిపారు.
పశ్చిమాన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నట్టు ఇక్కడ ఏర్పాటు కానున్న ఐటీ కంపెనీలకు రక్షణగా రాచకొండ ప్రాంతంలోనూ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఐటీ యాజమాన్యాలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఉప్పల్‌లో మూతపడిన పరిశ్రమల స్థానంలో ఐటీ పార్క్ నిర్మిస్తాం. ఇందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సంస్థలకు పూర్తి మద్దతు అందిస్తాం. ఉప్పల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మళ్లీ ప్రారంభమైతే ఇక్కడ మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందుతాయి. జెన్‌ప్యాక్ట్ వరంగల్‌లో కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆ సంస్థకు అభినందనలు అని అన్నారు.
జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్యర్, లాజిస్టిక్స్ లీడర్ విద్య శ్రీనివాసన్ మాట్లాడుతూ గురుగ్రామ్‌లో ఉన్న తమ సంస్థ రెండు దశాబ్దాల క్రితం హైరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేసిందని తెలిపారు. అప్పుడు రెండువేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య నేడు 23 వేలకు చేరిందని పేర్కొన్నారు. ఉప్పల్ విస్తరణతో ఇక్కడ ఐటీ రంగం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి, ఐటీ, ఈ అండ్ సీ విభాగం సీఈవో అమర్నాథ్ రెడ్డి, రాంకీ సీఈవో గౌతమ్ రెడ్డి, వడ్డమాని సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






