స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక ఖాయం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఊసరవెల్లులు రాజ్యం చేస్తే తొండలు, ఉడుతలు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైనా హైకోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతుందని జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాల్సిందేనని, ఈ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.