KTR: మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుందా?.. నిర్మలా సీతారామయన్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తమ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాశారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలను తీర్చి, తెలంగాణ రాష్ట్రానికి తరగని ఆస్తులను సృష్టించింది. రాష్ట్రం దశ-దిశను పూర్తిగా మార్చి, అభివృద్ధి మార్గంలో నిలిపింది. అయితే, దేశ చరిత్రలో అత్యధిక అప్పులు చేసిన మీ ప్రభుత్వానికి మమ్మల్ని విమర్శించే హక్కుందా? కేంద్రం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ రుణాల మాఫీ కోసమే కదా. ప్రతి బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.125 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ డబ్బుతో ఏం సాధించారో చెప్పాలి’’ అని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉందని, కానీ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. కేంద్రం ఎంత సహాయం చేసినా రాష్ట్రం మాత్రం అప్పుల నుంచి బయటపడలేని స్థితిలో ఉందని ఆమె చెప్పారు.