తెలంగాణలో రూ.1100 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్
జీవశాస్త్రాల రంగంలో 8.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని తెలంగాణ 2030 కంటే ముందుగానే చేరుకుంటుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రామారావు తెలిపారు. ఔషధాలు, టీకాల అభివృద్ధిలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలో పలు ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్ఎక్స్ ప్రొఫెల్లంట్ రూ.900 కోట్ల పెట్టుబడితో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధనశాలను, విమ్టాల్యాబ్ రూ.70 కోట్లతో నిర్మించిన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. అదే విధంగా జీవీపీఆర్ సంస్థ రూ.40 కోట్లతో 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకంగా ఎదిగిందన్నారు. దీనికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. రూ.1100 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ఐదు ప్రాజెక్టుల ద్వారా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.






