పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానం
ప్రపంచస్థాయి సంస్థల పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇంజినీరింగ్ ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఏటా 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఆర్ అండ్ డీ సెంటర్ 450 మంది ఇంజినీర్లకు ఉపాధి కల్పించబోతోందని ప్రకటించారు. లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసేలా ప్రభుత్వం తన కృషి కొనసాగిస్తుందని అన్నారు.
ధర్మో ఫిషర్స్ సంస్థ పరిశోధన కోసం ఏటా దేశ్యాప్తంగా 1.4 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇండియా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధన చేస్తోంది. గత నెలలో బోస్టన్లోని ధర్మో ఫిషర్స్ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ప్రతినిధులను కలిశాను. అప్పుడు నా గ్రాడ్యుయేషన్ రోజులు గుర్తొచ్చాయి. నేను కూడా భయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను అని మంత్రి తెలిపారు. పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని అన్నారు. గ్లోబల్ కేపబిలిటి సెంటర్లకు కూడా హైదరాబాద్ మంచి ప్రదేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.






