కెనడా తర్వాత అతిపెద్ద సంస్థ.. హైదరాబాద్ లోనే : మంత్రి కేటీఆర్
పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్‌లోనే జాంప్ పెద్ద బ్రాంచ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నార. కంపెనీల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. అన్ని రకాలుగా ఫార్మా సంస్థలకు జీనోమ్ వ్యాలీ అనువుగా ఉంటుందని, యూనిట్ల స్ఠాపనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలన్నారు.
గుజరాత్ పారిశ్రామికవేత్తలు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్‌లోనే ఇష్టపడుతున్నారన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ వాటా 33 శాతం ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అద్భుతమైన సహకారం అందిస్తుందన్నారు. 28 రోజుల్లోనే జాంప్ ఫార్మాకు భూమిని కేటాయించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బీ`హబ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని అన్నారు.త్వరలో బీ`హబ్‌ను ప్రారంభించి, బయోలాజికల్ పరిశోధనలకు తోడ్పాటునందించబోతున్నామని మంత్రి ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు మంచి సహకారాన్ని అందిస్తోదని జాంప్ ఫార్మా గ్రూప్ సీనియర్ వైస్ చైర్మన్ సుకంద్ జునేజా తెలిపారు. తమ కంపెనీ ఏర్పాటుకు 28 రోజుల్లోనే భూమి కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. జాంప్ ఫార్మా కెనడా తర్వాత అతిపెద్ద సంస్థను జీనోమ్ వ్యాలీలో నెలకొల్పడం గమనార్హం.






