రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిన సీఎం రేవంత్.. మండిపడ్డ కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మైక్ వీరుడని, మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తాడని సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెసోళ్లు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని, ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ మాత్రమే ఇప్పటివరకు రాష్ట్రంలో అమలవుతోందని, ఈ పథకం వల్ల ఆర్టీసీకి ఈ వంద రోజుల్లో రూ.1400 కోట్ల నష్టం వచ్చిందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ పథకాన్ని కొనసాగించి.. ఎన్నికలు ముగియగానే దీనికి కూడా మంగళం పాడేస్తారని ఆరోపించారు.
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధ్వాన్నంగా ఉందన్న కేటీఆర్.. రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అన్నారని, కానీ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రభుత్వానికి ఈ రంగంపై అవగాహన లేకపోవడమే కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫార్మా సిటీ పెట్టాలని రైతులకు మంచి పరిహారం ఇచ్చి భూసేకరణ చేశాం. అనుమతులు కూడా తెచ్చాం. ఇంతలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ఆ కంపెనీలకు జాగా ఇచ్చి లక్షల మందికి కొలువులు తెచ్చే ఫార్మా సిటీని నడుపుకోవాలి. కానీ తెలివి లేని సన్నాసి నాయకులు ఆ కంపెనీని ఇప్పటికీ మొదలుపెట్టలేదు. ఫాక్స్‌కాన్ కంపెనీనీ రాష్ట్రానికి రప్పించాం. మే నెలలోనే ఈ కంపెనీ ప్రారంభం కావల్సింది. కానీ ఇప్పటికీ మొదలుకాలేదు. కంపెనీలు, ఫ్యాక్టరీలు, యూనివర్సిటీలు, కాలేజీలు వస్తే రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. అవేమీ లేనప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఎలా ఉంటుంది’’అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.