KTR: గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే : కేటీఆర్

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి (Pradeep Chowdhury) తోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎల్.రమణ (Ramana) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే, గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనుకుంటోంది. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదు. సమాజంలోని రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల వారు అందరికీ హామీలు ఇచ్చి, కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది అని కేటీఆర్ ఆరోపించారు.