KTR: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేటీఆర్ మద్దతు

దేశంలో లోక్‌సభ (Lok Sabha) నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు తెలిపారు. దేశ అవసరాలకు తగినట్టు కుటుంబ నియంత్రణను బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశ నిర్మాణంలో తెలంగాణ (Telangana) , దక్షిణాది రాష్ట్రాలు (Southern states) చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగాణ కేవలం 2.8 శాతం మాత్రమే ఉండగా, జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తోందని కేటీఆర్ వివరించారు.