Konda Surekha: నాగార్జునకు సారీ చెప్పిన కొండా సురేఖ.. కేసుపై ఉత్కంఠ!
తెలంగాణ మంత్రి (Telangana Minister) కొండా సురేఖ (Konda Surekha) ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna), ఆయన కుటుంబ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె అర్ధరాత్రి సోషల్ మీడియాలో (Social Media) ఒక పోస్ట్ పెట్టారు. కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కొండా సురేఖ మంగళవారం అర్థరాత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. నాగార్జున కుటుంబానికి తన వ్యాఖ్యల వల్ల కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నట్లు తెలిపారు. నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తాను చేసిన వ్యాఖ్యలు వారిని బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో చేసినవి కావని వెల్లడించారు. వారి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని, అలాగే వారి పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం కూడా అసలు లేదని వివరించారు. తన మాటల వల్ల ఏవైనా అనుకోని అపోహలు లేదా పొరపాట్లు జరిగి ఉంటే, దానికి చింతిస్తున్నట్టు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. దీంతో ఆమె పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినట్లయింది.
కొంతకాలం కిందట మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) విమర్శలు చేసే సందర్భంలో నాగార్జున ఫ్యామిలీ, ముఖ్యంగా నాగచైతన్య-సమంత (Naga Chaitanya – Samantha) విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని నాగార్జున భావించారు. దీంతో నాగార్జున, మంత్రి కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావా (Defamation Suit) దాఖలు చేశారు. తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని మంత్రి కొండా సురేఖకు సమన్లు కూడా జారీ చేసింది. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కూడా న్యాయస్థానం నమోదు చేసింది.
నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై రేపు నాంపల్లి కోర్టులో మరోసారి విచారణ జరగాల్సి ఉంది. కోర్టు విచారణకు ఒక్క రోజు ముందు మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఈ కేసు భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ క్షమాపణల నేపథ్యంలో, నాగార్జున కుటుంబం న్యాయస్థానంలో ఏ విధంగా స్పందిస్తుంది, ఈ కేసును ఉపసంహరించుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.







