Konda Surekha: ఆయన వల్లనే ఈ స్థాయికి ఎదిగా.. కొండా సురేఖ కామెంట్స్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే తను ఇప్పుడు మంత్రి కాగలిగానని కాంగ్రెస్ నేత కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) దేశ యువతకు స్ఫూర్తి అని, దేశ సమగ్రత కోసం ఆయన తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. పారదర్శక పాలన కోసం సాంకేతికతను ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) ఆనాడే ఆలోచించారని మంత్రి సురేఖ పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇచ్చారని ఆమె (Konda Surekha) అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు ఆయనేనని గుర్తు చేశారు. కంప్యూటర్ను దేశానికి పరిచయం చేసి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించామని వివరించారు. రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సురేఖ (Konda Surekha) సూచించారు.







