KCR – Kaleswaram: చట్టప్రకారమే కాళేశ్వరం నిర్మాణం.. కమిషన్ ముందు కేసీఆర్ వాంగ్మూలం

తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన కాళేశ్వరం (Kaleswaram) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఆరోపిత అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (Justice P C Ghosh) నేతృత్వంలోని కమిషన్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ను విచారించింది. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ఈ విచారణ జరిగింది. సుమారు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్ అడిగిన 18 ప్రశ్నలకు కేసీఆర్ సమగ్ర సమాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్ణయాలు, బ్యారేజీల స్థానాల మార్పు, నీటి వినియోగం వంటి అంశాలపై వివరించారు. అలాగే, పలు డాక్యుమెంట్లను కమిషన్‌కు సమర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని అంశాలను క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చామని, క్యాబినెట్ ఆమోదంతోనే ఫైనల్ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. “పెద్ద ప్రాజెక్టు కాబట్టి, ముందుగా నిర్ణయం మేమే తీసుకున్నాం. అన్ని నిర్ణయాలు క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదించినవే” అని కేసీఆర్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థానాల మార్పు గురించి కమిషన్ ప్రశ్నించింది. టెక్నికల్ కమిటీ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ సిఫారసుల ఆధారంగానే ఈ మార్పులు జరిగాయని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. “టెక్నికల్ నిర్ణయాలన్నీ 100 శాతం ఇంజనీర్లు తీసుకున్నారు. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది, అందుకే ఆ స్థానం ఎంపిక చేశాం” అని వివరించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల ప్రత్యామ్నాయ స్థానాలను ఎంచుకున్నట్లు తెలిపారు.
బ్యారేజీలలో నీటిని నింపడం, లిఫ్ట్ చేయడం వంటి నిర్ణయాలు కూడా టెక్నికల్ నివేదికల ఆధారంగానే అధికారులు తీసుకున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. “నీటి లిఫ్టింగ్, బ్యారేజీల నిర్వహణ వంటి అంశాల్లో ఇంజనీర్ల నిర్ణయాలే అమలయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో 4,000 మంది ఇంజనీర్లు పనిచేశారు” అని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని సర్వేలు నిర్వహించామని, కేంద్రం నుంచి అన్ని అనుమతులు పొందామని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ. 280 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. అలాగే, “ది లైఫ్ లైన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు” పేరిట ఒక డాక్యుమెంట్‌ను కమిషన్‌కు సమర్పించారు. ఈ డాక్యుమెంట్‌లో ప్రాజెక్టు నిర్మాణం, నిర్ణయ ప్రక్రియలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో నీటి పరిస్థితులు, భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం గురించి కూడా కేసీఆర్ వివరించారు. “తెలంగాణలో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకమైనది. దేశంలో నీటి వినియోగం, లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టును రూపొందించాం” అని తెలిపారు.
ఆరోగ్య కారణాల వల్ల కేసీఆర్ వన్-టు-వన్ విచారణ కోరినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. చట్టప్రకారం ఈ విచారణ జరిగినట్లు వెల్లడించాయి. గతంలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఇరిగేషన్ మంత్రి టి. హరీశ్ రావు కూడా ఈ కమిషన్ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఆరోపిత అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత కొన్ని నెలలుగా విచారణ జరుపుతోంది. ఈ విచారణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. కేసీఆర్ సమర్పించిన డాక్యుమెంట్లు, ఆయన ఇచ్చిన సమాధానాలను కమిషన్ పరిశీలించనుంది. ఈ విచారణ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.