Kavitha: కవిత కీలక అడుగులు.. జాగృతికి రాజకీయ రంగు!?

భారత్ రాష్ట్ర సమితి (BRS) నుంచి సస్పెన్షన్‌కు గురైన కొద్ది వారాలకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమె దృష్టంతా ప్రస్తుతం తెలంగాణ జాగృతిని (Telangana Jagruthi) పునరుత్తేజం చేయడంపై కేంద్రీకృతమైంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థ రాష్ట్ర కమిటీకి నూతన సభ్యులను నియమించినట్లు ఆమె చేసిన తాజా ప్రకటన, ఆమె తదుపరి రాజకీయ ప్రయాణంపై నెలకొన్న ఊహాగానాలకు బలం చేకూర్చింది.
కవిత ఏర్పాటు చేసిన కమిటీలో సామాజిక న్యాయం ప్రధాన అంశంగా కనిపిస్తోంది. కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలోని 80 శాతానికి పైగా పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి కేటాయించినట్లు కవిత వెల్లడించారు. ముఖ్యంగా, ఎస్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత లకావత్ రూప్ సింగ్‌ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల వివక్ష చూపారంటూ వచ్చిన విమర్శలకు, ఈ నియామకాలు గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుందని జాగృతి వర్గాలు చెప్తున్నాయి. భవిష్యత్తులో ఆమె బడుగు బలహీన వర్గాల నాయకురాలిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కవిత తన రాజకీయ వ్యూహంలో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటనలో ఆమె కేవలం సంస్థాగత సమావేశాలకే పరిమితం కాకుండా, వివిధ జిల్లాల్లోని మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన సలహాల ఆధారంగానే కమిటీ మూడో దశ నియామకాలు ఉంటాయని ఆమె చెప్పారు. దీన్నిబట్టి కవిత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ కార్యకలాపాలను రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమె పోషించిన పాత్ర, తెలంగాణ జాగృతి ద్వారా సంపాదించుకున్న గుర్తింపును తిరిగి ప్రజల మధ్యకు తీసుకెళ్లి తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం, ఇప్పుడు జాగృతి పునరుత్తేజం చేయడం.. ఇవన్నీ కవిత భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ఆమె కేవలం జాగృతి వేదికగా సామాజిక ఉద్యమకారిణిగా మాత్రమే కొనసాగుతారా? లేకుంటే ఈ వేదికను ఉపయోగించుకుని కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె ప్రకటనలు పూర్తిగా సామాజిక న్యాయం, తెలంగాణ అస్తిత్వం, ప్రజల సలహాల సేకరణ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, బీఆర్‌ఎస్ పార్టీ బలహీనపడుతున్న ఈ తరుణంలో, ఆమె ఎంచుకున్న ఈ మార్గం తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు.