Mahesh Goud: కవితను పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు: మహేశ్ గౌడ్
కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీభవన్లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కవిత (Kavitha) లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి సమాధానమూ లేదన్నారు. ఫలితంగా బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రజలు నమ్ముతున్నారని, భవిష్యత్తులో ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదన్నారు. బీజేపీ (BJP) రాష్ట్రంలో ప్రభావం చూపించే స్థితిలో లేదన్నారు. బీజేపీ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. తామూ హిందూ మతానికి చెందిన వారిమేనని, తాము కొలిచేదీ హిందూ దేవుళ్లనేనని చెప్పారు. దేవుళ్లను దేవళ్లలాగే చూడాలే కానీ, వారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిలో 90 శాతానికి పైగా హిందూ మతానికి చెందిన వారేనన్నారు. 18న మేడారంలో క్యాబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో మొదటిసారిగా హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం జరగనుండటం శుభ పరిణామమన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






