Kavitha: క్రాస్‌రోడ్స్ లో కవిత.. భవిష్యత్తు అగమ్యగోచరం..!!

బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుమార్తెగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలిగా కవిత (Kavitha) ఎన్నో పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ పార్టీలో ఆమెకు సముచిత ప్రాధాన్యత లభించలేదనే అక్కసుతో పార్టీపైన ఆరోపణలు చేయడం, పార్టీ సస్పెండ్ చేయడం, ఆమె పార్టీ పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీ పెట్టడం, కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడం, లేక వేరే మార్గం ఎంచుకోవడం వంటి అనేక అవకాశాలు ఆమె ముందున్నాయి.
కవిత బీఆర్‌ఎస్ నుంచి బయటకు రావడానికి పలు కారణాలు ఉన్నాయి. పార్టీలో ఆమెకు సముచిత స్థానం ఇవ్వకపోవడం, హరీష్ రావు, సంతోష్ రావు వంటి నాయకుల కుట్రలు ఆమెను సస్పెండ్ చేయించాయని కవిత ఆరోపించారు. చివరకు బయటకు వచ్చేశారు. అయితే ఆమె సొంత పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ అనే పదాన్ని భుజానికెత్తుకుని, బీసీల కోసం, మహిళల సంక్షేమం కోసం పోరాడతానని ఆమె ప్రకటించారు. అయితే, సొంత పార్టీ పెట్టడం అంత సులభం కాదు. కవిత సొంత పార్టీ పెట్టినా బీఆర్‌ఎస్ కేడర్ ఆమె వెంట నడుస్తుందని చెప్పలేం. జాగృతిలోనే కొంతమంది నాయకులు కవితకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో, ఆమె సొంత పార్టీ ఎంత విజయవంతమవుతుందనేది సందేహాస్పదమే.
కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఆమె కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కాంగ్రెస్‌లో చేరడం ఆమెకు అంత సులభం కాదు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి బలమైన నాయకులు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. అధికారంలో ఉంది. ఎంతోమంది సీనియర్ నేతలు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్లందరినీ కాదని కవితకు పెద్ద బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే ఆమె ఒక సాధారణ నాయకురాలిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది ఆమె రాజకీయ ఆకాంక్షలకు సరిపోదు. బీజేపీలో చేరే అవకాశం కూడా కవితకు దాదాపు లేదనే చెప్పవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను జైలుకు పంపిన బీజేపీపై కవితకు తీవ్రమైన అక్కసు ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా కవితను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆమెకు ఛాయిస్ కాకపోవచ్చు.
ప్రస్తుతానికైతే కవిత తన జాగృతి సంస్థ ద్వారా బీసీలు, మహిళల సంక్షేమం కోసం ఉద్యమాలు చేస్తూ, రాజకీయంగా స్వతంత్రంగా ముందుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మున్ముందు అవసరం, అవకాశాన్ని బట్టి రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నట్టు ఆమె సన్నిహితులు చెప్తున్న మాట. బీఆర్ఎస్ నుంచి తనవైపు వచ్చే నేతలు, కేడర్ ను బట్టి ఆమె పార్టీ పెట్టాలా, వద్దా అని నిర్ణయించుకునే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా పార్టీలో చేరేందుకే ఆమె మొగ్గు చూపవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఆమెకు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రాస్ రోడ్స్ నుంచి ఎలా బయట పడాలనేదానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.