Kavitha: అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీశ్ దా? బీఆర్ఎస్ దా? : కవిత
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం హరీశ్‌రావు (Harish Rao) తీసుకున్నదా? లేక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయమా? అనేది ప్రజలకు తెలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లిలో కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యులు హరీశ్‌ను తిడితే, బీఆర్ఎస్ వారందరినీ సభకు రాకుండా హరీశ్‌రావు సొంత నిర్ణయంతో సమావేశాలను బహిష్కరించారని ఆరోపించారు. మరి కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్‌ను (KCR) తిడితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హరీశ్‌రావు బీఆర్ఎస్ లో ఓ గ్రూపును తయారు చేసుకుంటున్నారని, బాయ్‌కాట్ డ్రామా కచ్చితంగా ఆయనదేనని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వదిలి బయట సభలు పెడితే ఎవరు నమ్ముతారని పేర్కొన్నారు. ప్రతిపక్షమే లేకుండా సభ జరగడంతో పాలకపక్షం అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిందని కవిత ఆరోపించారు. కృష్ణా నదిలో తక్కువ నీటివాటాకు ఒప్పుకొంటూ హరీశ్‌రావు సంతకం చేశారన్న అధికార పక్షం ఆరోపణలపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ఉరితీయాలని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అంటున్నారని, కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు నష్టం చేస్తున్న రేవంత్‌రెడ్డిని రెండుసార్లు ఉరితీయాలని కవిత వ్యాఖ్యానించారు






