Kavitha: గుచ్చుకున్న గులాబీ ముల్లు… మండలిలో కవిత కంటతడి
తెలంగాణ శాసనమండలి వేదికగా ఊహించని, ఉద్విగ్నభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా, ఉద్యమనేత కుమార్తెగా వెలుగొందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లు గుండెలో దాచుకున్న ఆవేదనను, పార్టీలో తనకు జరిగిన అవమానాలను ఏకరువు పెడుతూ ఆమె కంటతడి పెట్టడం సభలోని సభ్యులను, రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వ్యవహారశైలిని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
“ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించాను. పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాను. కానీ, చివరకు నన్ను దారుణంగా అవమానించి బయటకు గెంటేశారు,” అంటూ కవిత గద్గద స్వరంతో మాట్లాడారు. 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశానని, అయితే ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఆమె గుర్తుచేశారు. సొంత పార్టీలోనే ప్రజాస్వామ్యం లేకపోతే, ఇక రాష్ట్రంలో పాలన ఎలా సక్రమంగా ఉంటుందని ఆమె నిలదీశారు. తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు నాయకులు తనను అనేక సందర్భాల్లో అవమానించారని, మానసికంగా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా మండలి చైర్మన్ ఆమోదించకపోవడంతోనే, సభకు వచ్చి తన బాధను చెప్పుకోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడమే తాను చేసిన నేరమా? అని కవిత ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం నిర్మాణం మొదలుకొని, జిల్లాల్లోని కలెక్టరేట్ల నిర్మాణం వరకు అన్నింటా అవినీతి రాజ్యమేలిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. “సిద్దిపేటలో నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. ఇది అవినీతికి నిదర్శనం కాదా?” అని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌పై, ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను చూసి తట్టుకోలేక, అంతర్గత సమావేశాల్లో తాను ప్రశ్నించానని చెప్పారు. అయితే, పార్టీలో పెద్ద నాయకులమని చెప్పుకునే వారెవరూ ఆ సమయంలో స్పందించలేదని, కనీసం ఖండించలేదని ఆమె మండిపడ్డారు. తాను ధైర్యం చేసి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అవినీతిపరుల పేర్లు బయటపెట్టానని, అదే తనకు శాపంగా మారిందని వాపోయారు.
తాను రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నప్పుడు పార్టీ తనను ఒంటరిని చేసిందని కవిత ఆక్రోశం వెళ్లగక్కారు. “కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైలులో పెట్టినా.. పార్టీ నాకు అండగా నిలవలేదు. ఒక మహిళగా, పార్టీ కార్యకర్తగా నేను పడ్డ వేదనను ఎవరూ పట్టించుకోలేదు,” అంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన పార్టీనే తనను పరాయిదానిలా చూసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని, అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తాను ఎన్నోసార్లు పార్టీ వేదికలపై డిమాండ్ చేసినా పెడచెవిన పెట్టారని కవిత ఆరోపించారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని తాను కేసీఆర్‌ను ఎన్నోసార్లు కోరానని, కానీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో అవమానకరంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించే ధైర్యం ఉన్నందుకే తనపై కక్షగట్టారని, తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే కుట్రలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తానికి, శాసనమండలి వేదికగా కవిత చేసిన ఈ భావోద్వేగ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత.. ఇప్పుడు అదే తండ్రి విధానాలపై, సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.






